ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో లొంగిపోయిన మావోయిస్టుల జీవితాల్లో కొత్త మార్పు కనిపిస్తోంది. గతంలో అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగిన చేతులు ఇప్పుడు రంగురంగుల దారాలు, పూసలతో అందమైన రాఖీలు తయారు చేస్తున్నాయి. పునరావాస కేంద్రం ద్వారా వారికి కొత్త జీవన మార్గం అందుతోంది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రంలో లొంగిపోయిన మావోయిస్టులకు వివిధ వృత్తుల్లో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేకంగా రాఖీల తయారీ కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ పొందుతున్న వారు వెయ్యికి పైగా రాఖీలను తయారు చేసి మార్కెట్లో విక్రయించారు. రంగురంగుల దారాలు, ఆకర్షణీయమైన అలంకరణలతో రూపొందించిన ఈ రాఖీలకు మంచి ఆదరణ లభించింది. దీంతో తమ శ్రమకు తగిన ఫలితం లభిస్తోందని వారు సంతోషం వ్యక్తం చేశారు.
కాంకేర్ జిల్లా చౌగేల్ గ్రామంలోని పునరావాస కేంద్రం కేవలం శిక్షణ కేంద్రంగానే కాకుండా లొంగిపోయిన వారికి గౌరవప్రదమైన జీవితం అందించే వేదికగా మారింది. రాఖీల తయారీతో పాటు ఇతర వృత్తుల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. గతంలో హోలీ సందర్భంగా గులాల్ తయారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
ఈ రక్షాబంధన్ తమకు ప్రత్యేకమైనదని శిక్షణ పొందుతున్న మహిళలు తెలిపారు. గతంలో పండుగలకు దూరంగా ఉన్న వారు ఇప్పుడు భద్రతా సిబ్బంది, తోటి శిక్షణార్థులతో కలిసి రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. తుపాకీని వదిలి చేతివృత్తులను నేర్చుకుంటున్న వీరి ప్రయాణం శాంతి, స్వయం సమృద్ధి వైపు సాగుతోంది.
తుపాకీ వదిలి.. రాఖీలతో కొత్త జీవితం
11
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk