ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా చైల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పూజా పాల్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.1.55 లక్షలు మాయమయ్యాయి. తనకు తెలియకుండానే ఫోన్ పే, యూపీఐ ద్వారా పలుమార్లు లావాదేవీలు జరిగి డబ్బు విత్‌డ్రా అయినట్లు ఆమె గుర్తించారు.
పూజా పాల్ ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఖాతా కలిగి ఉన్నారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు తన ఖాతా నుంచి పలు లావాదేవీలు జరిగినట్లు బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలనలో గుర్తించారు. ఈ విషయం సెప్టెంబర్ 14న ఆమెకు తెలిసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
తన ఐఫోన్ 17 ఎయిర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉండవచ్చని, బ్యాంకింగ్ మరియు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి డబ్బు ఉపసంహరించి ఉండవచ్చని పూజా పాల్ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్, ఫోన్ పే, యూపీఐ వివరాలు, బ్యాంక్ ఖాతా లావాదేవీలను పరిశీలిస్తున్నారు.
ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరిగిన అన్ని లావాదేవీలపై పూర్తి దర్యాప్తు చేయాలని, టెక్నికల్ ఆడిట్ నిర్వహించాలని ఆమె కోరారు. అలాగే మోసపూరితంగా విత్‌డ్రా అయిన సుమారు రూ.1.55 లక్షలు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు.
యూపీ బీజేపీ ఎమ్మెల్యే పూజా పాల్ ఖాతా నుంచి రూ.1.55 లక్షలు మాయం.. యూపీఐ మోసం అనుమానం
0
Published: 📅
Reported by: 🖊
Sarika Sk