నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. నందిపాడు బైపాస్ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ ట్యాంకర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కారు, అంబులెన్స్ సహా మొత్తం నాలుగు వాహనాలు ఢీకొన్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం, అదే రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది ప్రయత్నిస్తుండగా, వారికి ఓ వ్యక్తి సహాయం చేశాడు. అందరూ కలిసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లోకి ఎక్కించే సమయంలో ఒక్కసారిగా వేగంగా వచ్చిన ట్యాంకర్ అదుపుతప్పి అక్కడున్న వాహనాలను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అంబులెన్స్ సిబ్బందికి సహాయం చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని పొన్నూరుకు చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి ట్యాంకర్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణమా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు.
మిర్యాలగూడలో ట్యాంకర్ బీభత్సం.. అంబులెన్స్‌కు సాయం చేస్తూ వ్యక్తి మృతి
6
Published: 📅
Reported by: 🖊
Sarika Sk