హైదరాబాద్, సెప్టెంబర్ 11: బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడలేదని విమర్శించారు. శాసనసభ సమావేశాలు సజావుగా జరగకుండా కేసీఆర్ అధ్యక్షతన ఫాంహౌస్‌లో కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులపై అనుచితంగా వ్యవహరించారని సీఎం ఆరోపించారు. మూడు రోజుల పాటు సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించేలా వ్యవహరించారని విమర్శించారు. మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బంది కలిగించడం వంటి ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు.
కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలు ఇచ్చిన పదవులను బాధ్యతగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ చర్చల్లో తప్పనిసరిగా పాల్గొనాలని, నియోజకవర్గ సమస్యలను సభలో ప్రస్తావించాలని కోరారు.
ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలపై కూడా సీఎం విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వకుంటే వారు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా అని ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా, SIR అంశంపై కూడా రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఎమ్మెల్యే బాధ్యత అని పేర్కొన్నారు.
అధికారం పోయినా అహంకారం వీడలేదు: బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ ఫైర్
1
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati