అమ్రాబాద్, సెప్టెంబర్ 7: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో తీవ్ర కలకలం రేపిన హత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎండీ బురానుద్దీన్(49) అనే వ్యక్తి తన సొంత ఇంటిలోనే దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, బురానుద్దీన్‌ను తలపై కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పెద్ద ఇనుప పెట్టెలో ఉంచినట్లు సమాచారం. వాసన రాకుండా పౌడర్ చల్లినట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. భార్య సఫియా, కుమారులు ఇలియాజ్, ఖదీర్‌లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బురానుద్దీన్ ఫోన్ చేయకపోవడంతో అచ్చంపేటలో ఉన్న ఆయన అక్కలు సమాచారం ఇవ్వగా, స్థానికులు ఇంటికి వెళ్లి పరిశీలించడంతో ఘటన బయటపడింది. అనంతరం నిందితులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ హనుమంతురెడ్డి దర్యాప్తు చేపట్టారు.
కుటుంబ సభ్యుల మధ్య గతంలోనూ తరచూ గొడవలు జరిగేవని స్థానికులు వెల్లడించినట్లు సమాచారం. పోస్టుమార్టం అనంతరం మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది.
సొంతింట్లోనే దారుణ హత్య.. ఇనుప పెట్టెలో మృతదేహం దాచిన ఘటన
13
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan