డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక సందర్భంగా నిర్వహించిన పార్టీలో అగ్ని ప్రమాదం సంభవించి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశ రాజధాని కిన్‌షాషాలోని లింగ్వాలా ప్రాంతంలో శుక్రవారం రాత్రి జరిగింది.
స్థానిక సమాచారం ప్రకారం.. లింగ్వాలా ప్రాంతంలోని ఓ భవనంలో పెళ్లి పార్టీ జరుగుతుండగా అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో పలువురు భవనం నుంచి బయటకు రాలేక చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. భవనంలో మంటలు శనివారం తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు అధికారులు తెలిపారు.
లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు 22 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియలేదని తెలిపారు.
పెళ్లి వేడుకలో ఆనందంగా గడపాల్సిన సమయంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచింది. అగ్ని ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పెళ్లి వేడుకలో విషాదం.. కాంగోలో అగ్ని ప్రమాదంతో 22 మంది మృతి
13