ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నగరంలోని అక్రమ నిర్మాణాలపై బుల్‌డోజర్లను ఉపయోగించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బుల్‌డోజర్ యాక్షన్ జరుగుతున్న సమయంలో సీనియర్ మున్సిపల్ అధికారులు తప్పనిసరిగా సంఘటనా స్థలంలో ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న అన్ని పీజీ హాస్టళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమ నిర్మాణాలు గుర్తిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలు ఎప్పుడు జరిగాయి? ఎవరి హయాంలో జరిగాయి? అనే విషయాలను తెలుసుకునేందుకు భవనాల రికార్డులను పరిశీలించాలని సూచించారు.
దక్షిణ ఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఐదు అంతస్థుల పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. 50 ఏళ్ల నాటి భవనంలో బేస్‌మెంట్ మార్పులు చేయడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై సీఎం రేఖా గుప్తా మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు.
ఈ ఘటన అనంతరం సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ సహా ఐదుగురు మున్సిపల్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నగరంలోని అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అక్రమ నిర్మాణాలపై ఢిల్లీ సర్కార్ కొరడా.. రంగంలోకి బుల్‌డోజర్లు
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan