ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని ఏపీ జేఏసీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని ఏపీ జేఏసీ ఛైర్మన్ విద్యాసాగర్, సెక్రటరీ కేఎస్‌ఎస్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.
పీఆర్సీ, డీఏలు, సరెండర్ లీవులు, హెల్త్ కార్డులు, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు విద్యాసాగర్ వెల్లడించారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న మొత్తం ఐదు డీఏల్లో రెండింటిని ఒకే నెలలో చెల్లిస్తామని, సరెండర్ లీవులకు సంబంధించి ఒక విడత చెల్లింపు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. పోలీస్ ఉద్యోగులకు సెప్టెంబర్ నుంచి అదనంగా మరో సరెండర్ లీవ్ ప్రకటించినట్లు వివరించారు.
ఉద్యోగుల ఆరోగ్య కార్డుల సమస్యను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు విద్యాసాగర్ తెలిపారు. హెల్త్ ట్రస్టుకు నిధుల విడుదలపై సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారని, పెన్షనర్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను 10 శాతానికి పెంచే అంశాన్ని జనవరి 1 నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇంటీరియమ్ రిలీఫ్‌పై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, గ్రామ-వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలపై కూడా చర్చలు జరిగాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి వెనుకాడబోమని ఏపీ జేఏసీ స్పష్టం చేసింది.
ఏపీ జేఏసీ సెక్రటరీ కేఎస్‌ఎస్ ప్రసాద్ కూడా సీఎం స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు, పాత పెన్షన్ విధానం, గురుకులాలు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసు, టెట్ సమస్యలపై చర్చించినట్లు తెలిపారు.
ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూల స్పందన.. ఏపీ జేఏసీ నేతల హర్షం
17
Published: 📅
Reported by: 🖊
Sarika Sk