హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో గణేశ్ ఆగమన్ కార్యక్రమం విషాదంగా ముగిసింది. రాంనగర్ చౌరస్తాలో శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులంతా ఒక్కసారిగా గుమిగూడడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఈ తొక్కిసలాటలో బద్రీనాథ్ అనే 19 ఏళ్ల విద్యార్థి మృతి చెందారు. రాంనగర్‌లోని గౌరీశంకర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న బద్రీనాథ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా అని పోలీసులు గుర్తించారు.
బద్రీనాథ్ హైదరాబాద్‌లోని అబిడ్స్ ప్రాంతంలో ఉన్న మెథొడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. గణేశ్ ఆగమన్ కార్యక్రమానికి వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
గణపతి నవరాత్రుల నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. భారీ జనసందోహం ఉన్న సందర్భాల్లో మరింత అప్రమత్తత అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
హైదరాబాద్‌లో గణేశ్ ఆగమన్ వేడుకలో విషాదం.. తొక్కిసలాటలో విద్యార్థి మృతి
17
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan