తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గత వెయ్యి రోజులుగా రాబందు, రాక్షస పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనల్లో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలోని హబ్సీపూర్ క్రాసింగ్ వద్ద నిర్వహించిన ‘రైతు పొలికేక’ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం తాము ఉద్యమించామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ రోడ్లపైకి రావాల్సి వస్తోందని అన్నారు. గతంలో 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి మారిందని ఆరోపించారు. ఉచిత విద్యుత్ హామీపై కూడా ఆయన విమర్శలు చేశారు.
రైతుబంధు, రైతు బీమా, ఎరువుల సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం వైఖరిని ఆయన ప్రశ్నించారు. యూరియా, డీఏపీ అందుబాటులో లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు.
మేడిగడ్డ వద్ద నీటి లభ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. వెయ్యి రోజుల పాలనలో అబద్ధాలు, ఓట్లు, భూ కబ్జాలు తప్ప మరేమీ లేవని విమర్శిస్తూ, రైతు ప్రయోజనాల కోసం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని అన్నారు.
రేవంత్ పాలనపై హరీశ్ రావు ఫైర్.. రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ విమర్శలు
9
Published: 📅
Reported by: 🖊
Banu Prakash