ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ వారసత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ‘సీఈవో సీఎం’గా కంటే ప్రజలకు నీటిని అందించిన నాయకుడిగా గుర్తుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన వారసత్వం నీటి ప్రవాహంలో కనిపించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.
ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురితమైన ‘సీఈఓ సీఎం టు వాటర్ మ్యాన్: నాయుడుస్ లాంగ్ జర్నీ ఎంటర్స్ టూ ఏ న్యూ ఫేజ్’ అనే కథనంపై స్పందిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా తన ఎక్స్ ఖాతా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ, వెలిగొండ ప్రాజెక్టులను చంద్రబాబు కీలక మైలురాళ్లుగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా కలలుగా ఉన్న ఈ రెండు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు వాస్తవ రూపం దాల్చాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సాగునీటి ప్రాజెక్టులు రైతులకు ఆశను కల్పిస్తాయని, వ్యవసాయ రంగానికి కొత్త ఊపును ఇస్తాయని సీఎం తెలిపారు. అలాగే తాగునీటి భద్రతకు ఇవి చిరస్థాయిగా నిలిచిపోయే ఆస్తులుగా మారతాయని పేర్కొన్నారు. నీటి వనరుల అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
నీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం ద్వారా ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకురావడమే తన లక్ష్యమని చంద్రబాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతి రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.
సీఎంగా కాదు.. నీళ్లు అందించిన నాయకుడిగా గుర్తుండాలనుకుంటున్నా: చంద్రబాబు
18
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati