రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జక్కంపూడి రాజాపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గోపాలపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత మద్దిపాటి వెంకటరాజును దూషించారనే ఆరోపణలతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దూబచర్ల గ్రామానికి చెందిన బోడిగడ్డ నాగ రఘు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జక్కంపూడి రాజాపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
సెప్టెంబర్ 2న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జక్కంపూడి రాజా హాజరయ్యారు. సభా వేదిక నుంచి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యేపై Cr.No.216/2026 కింద BNS సెక్షన్లు, అలాగే ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఈ వ్యవహారం తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. దూషణలపై పోలీసులకు ఫిర్యాదు
13
Published: 📅
Reported by: 🖊
Banu Prakash