పాకిస్థాన్ క్రికెట్‌లో వరుస వివాదాలు కొనసాగుతున్న సమయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెటర్ల ఫోన్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆటగాళ్ల ఫోన్లను బోర్డు కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఇంగ్లండ్-పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ జట్టు ఇప్పటికే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. తొలి రెండు టెస్టుల్లో ఓటముల తర్వాత పీసీబీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడో టెస్టుకు ముందు ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి స్వదేశానికి పంపినట్లు సమాచారం. అలాగే హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌లపై కూడా చర్యలు తీసుకుని కొత్త ఆటగాళ్లు, కోచ్‌లను నియమించింది.
ఇప్పటికే జట్టు ఎంపిక, కోచింగ్ సిబ్బంది మార్పులు, ఆటగాళ్లపై వేటు వంటి పరిణామాలతో పాక్ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ఫోన్ల స్వాధీనం వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఫోన్లను ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? ఏ అంశంపై దర్యాప్తు జరుగుతోంది? అనే విషయాలపై పీసీబీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. మూడో టెస్టుకు ముందే ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
పాకిస్థాన్ క్రికెట్‌లో కలకలం.. ఆటగాళ్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ
12
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla