కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 10: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అటవీ సరిహద్దు గ్రామాల ప్రజల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై కూడా పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ సమీక్షలో అటవీ శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పులి కదలికలపై అటవీ శాఖతో పాటు ‘హనుమాన్’ బృందాలు నిరంతర నిఘా కొనసాగించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అవసరమైన అన్ని చర్యలను వివిధ శాఖలు సమన్వయంతో అమలు చేయాలని తెలిపారు.
స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులికి ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు కలిసి పనిచేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
కాకినాడ జిల్లాలో పులి సంచారం.. భద్రతా చర్యలపై సమీక్షించిన డిప్యూటీ సీఎం పవన్
1
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati