అమరావతి, సెప్టెంబర్ 10: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఈ మేరకు వర్ష సూచన, అప్రమత్తత సూచనలు జారీ చేసింది.
ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం ఉదయం 5:30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సముద్రంలో అలజడి పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రజలు గమనించాలని సూచించారు.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు తెలిపారు. సముద్ర పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షాలు, గాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలకు అవకాశం, మత్స్యకారులకు హెచ్చరిక
3
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati