అమరావతి, సెప్టెంబర్ 10: వైసీపీ అధినేత జగన్ చేపట్టనున్న పాదయాత్రపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ పాదయాత్ర రాష్ట్ర లేదా ప్రజల సంక్షేమం కోసం కాదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఉద్దేశించినదని ఆరోపించారు.
స్థానిక సంస్థలు ముఖ్యమైనవి కావని జగన్ భావించడం ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసేలా ఉందని యనమల అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే వాటిని ఎదుర్కొనేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. వైసీపీ అధినేత వ్యాఖ్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి బయటపడిందని పేర్కొన్నారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ నేతలు కోర్టులో సవాల్ చేశారని యనమల ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించినప్పుడు జగన్ మౌనంగా ఉన్నారని అన్నారు. దీంతో బీసీలు 10 శాతం రిజర్వేషన్లను కోల్పోయారని తెలిపారు.
ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మరోసారి మోసం చేయడం ద్వారా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారని యనమల విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నారని ఆరోపించారు.
జగన్ పాదయాత్ర ఏపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: యనమల రామకృష్ణుడు
1
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati