హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు పార్టీ కార్యకర్తల్లో సేవా భావాన్ని పెంపొందించడమే ఈ అభియాన్ లక్ష్యమని రాంచందర్‌రావు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17న ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటిలో దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
జన్‌ధన్ యోజన, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా పేదలకు సంక్షేమ ప్రయోజనాలు నేరుగా అందుతున్నాయని రాంచందర్‌రావు వివరించారు. యూపీఐ, డిజిటల్ చెల్లింపుల విస్తరణతో భారత్ ప్రపంచ డిజిటల్ పేమెంట్ రంగంలో కీలక స్థానాన్ని సాధించిందని తెలిపారు.
పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, ముద్ర రుణాల ద్వారా చేతివృత్తిదారులు, చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మేరే సప్నో కా భారత్, సేవా కీ కహానీ, సేవా జ్యోతి కలశ్ యాత్ర, సుశాసన్ సేవా సంవాద్ వంటి కార్యక్రమాలు కూడా అభియాన్‌లో భాగంగా నిర్వహిస్తామని తెలిపారు
సెప్టెంబర్ 17 నుంచి సేవా సంకల్ప్ అభియాన్ ప్రారంభం: బీజేపీ
1