విశాఖపట్నం, సెప్టెంబర్ 11: పార్టీలోకి కొత్తగా ఎవరిని చేర్చుకోవాలన్నా స్థానిక నాయకత్వం అంగీకారం తప్పనిసరిగా ఉంటుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు.
విజయనగరం జిల్లాకు చెందిన చిన్న శ్రీనును కూడా స్థానిక నాయకత్వం ఆమోదంతోనే టీడీపీలోకి తీసుకున్నామని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు.
విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన పల్లా శ్రీనివాసరావు.. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నాయకుల అభిప్రాయాలు కీలకమని అన్నారు. సముద్రంలో నదులు కలవవని, నదులే సముద్రంలో కలవాలని వ్యాఖ్యానిస్తూ పార్టీలో చేరేవారు పార్టీ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూటమి పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుంటాయని ఆయన తెలిపారు. యువత సామర్థ్యం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్‌పై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు.
కూటమి పార్టీల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. ఫేక్ అకౌంట్ల ద్వారా విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటికి ఎవరూ ప్రభావితం కాకూడదని సూచించారు
స్థానిక నాయకత్వం ఆమోదంతోనే పార్టీలోకి కొత్త నేతలు: పల్లా శ్రీనివాసరావు
1
Published: 📅
Reported by: 🖊
Kanakadri