హైదరాబాద్, సెప్టెంబర్ 16: కొంతమందిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ శాసనసభలో మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే కారణంతో ప్రధాన ప్రతిపక్షం కుట్ర పూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు.
ప్రభుత్వ భూముల అంశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయని సీఎం విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు సమాన గౌరవం ఇస్తుందని, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
సభాపతిని గౌరవించడం శాసనసభ సభ్యుల సంప్రదాయమని రేవంత్ రెడ్డి అన్నారు. సభలో ప్రతి సభ్యుడి హక్కులను కాపాడే బాధ్యత సభాపతిదేనని చెప్పారు. గత ప్రభుత్వమే సభ నిర్వహణకు సంబంధించిన కొన్ని నిబంధనలు రూపొందించిందని, వాటి ప్రకారమే సభాపతి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
సభలోకి రావడానికి ముందు క్షమాపణ చెప్పి ప్రజా సమస్యలపై చర్చిస్తారని భావించినా, ప్రతిపక్ష సభ్యులు విచక్షణ కోల్పోయి వ్యవహరించారని సీఎం అన్నారు. స్పీకర్ ఆదేశాల మేరకే బీఆర్‌ఎస్ సభ్యులపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వారు సభకు రాకపోయినా ప్రజా సమస్యలపై చర్చించే బాధ్యతను ప్రభుత్వం కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.
వాళ్లను చరిత్ర క్షమించదు.. ప్రతిపక్ష తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
1