విజయవాడ, సెప్టెంబర్ 11: కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షపై వైసీపీ చేస్తున్న విమర్శలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు. డీఎస్సీ పరీక్షను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సూచించారు.
మంత్రి నారా లోకేశ్ డీఎస్సీ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసినప్పటికీ, జగన్ ఇప్పటివరకు స్పందించలేదని కేశినేని చిన్ని అన్నారు. డీఎస్సీ ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించడాన్ని వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.
మరో మూడు డీఎస్సీలను మంత్రి లోకేశ్ నిర్వహించి తీరుతారని కేశినేని చిన్ని ప్రకటించారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మరని, రాబోయే ఎన్నికల్లో ప్రజలే వారికి సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా తెలియకుండా విమర్శలు చేస్తున్నారని చిన్ని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటాలో పరీక్షలు ఉండవని, మెరిట్ కోటా ప్రకారం ఎంపికలు జరుగుతాయని వివరించారు. డీఎస్సీ విషయంలో వస్తున్న ఆరోపణలకు అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చారని తెలిపారు.
డీఎస్సీ పరీక్షల్లో నిజంగా అభ్యంతరాలు ఉంటే పరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ తెలిపారు. అయితే ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజల కుటుంబాల్లో ఆనందం తీసుకురావడమేనని స్పష్టం చేశారు.
లోకేశ్ సవాల్‌కు జగన్ ఇప్పటికీ స్పందించలేదు: ఎంపీ కేశినేని చిన్ని
4
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati