హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ ఉత్పత్తి పెంచడంతో పాటు విద్యుత్ పొదుపుపైనా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హెచ్‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో జరిగిన CII - ఎనర్జీ ఎఫిషియెన్సీ కౌన్సిల్ నిర్వహించిన 25వ ‘ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్-2026’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉత్పత్తి చేసే విద్యుత్ కంటే అవసరం లేకుండా పొదుపు చేసే విద్యుత్ యూనిటే చౌకైనదని అన్నారు. ఇంధన సామర్థ్యాన్ని కేవలం పర్యావరణ బాధ్యతగా చూడకూడదని, ఇది ఆర్థిక పోటీతత్వాన్ని పెంచే వ్యూహమని తెలిపారు.
మెరుగైన మోటార్లు, శీతలీకరణ వ్యవస్థల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన సూచించారు. స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌తో విద్యుత్ వృథాను అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్ తగ్గితే విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. పరిశ్రమలు, తయారీ, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధితో విద్యుత్ అవసరం పెరుగుతోందని పేర్కొన్నారు.
పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్‌తో ఇంధన సామర్థ్యాన్ని పెంచాలని భట్టి సూచించారు. కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో విద్యుత్ వృథాను గుర్తించి వినియోగాన్ని మరింత సమర్థవంతం చేయాలని తెలిపారు. ఇంధన సామర్థ్యాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, ప్రభుత్వం, పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
ఇంధన పొదుపుతో దేశానికి మరింత భద్రత: భట్టి విక్రమార్క
3