సినిమాలు, షార్ట్‌ఫిలిమ్స్‌లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ పలువురు బాధితులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. అంబర్‌పేట్ శివంరోడ్డులోని డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్ ఇంటి ముందు బాధితులు ధర్నా చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.బాధితుల కథనం ప్రకారం.. డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ గౌడ్, అతని అనుచరులు శ్రీరామ్, లావణ్యలు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.20 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేశారని, సినిమా అవకాశాలపై అడిగిన ప్రతిసారీ రేపు, మాపు అంటూ కాలయాపన చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను మోసం చేశారని గ్రహించిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని బాధితులు స్పష్టం చేశారు. డిస్ట్రిబ్యూటర్ శివను బయటకు పిలిపించి తమతో మాట్లాడించాలని పోలీసులను కోరారు. పోలీసులకు, బాధితులకు మధ్య వాగ్వాదం జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.ఇప్పటికే శివపై పలు కేసులు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. సుమారు 25 మంది మహిళలను సినిమా అవకాశాల పేరుతో మోసం చేశారని పేర్కొన్నారు. తన కుమార్తెకు హీరోయిన్ అవకాశం ఇప్పిస్తానని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నారని ఓ బాధితురాలు ఆరోపిస్తూ తీవ్ర ఆవేదనకు గురై సొమ్మసిల్లి పడిపోయారు. ఆమెను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది.
సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం.. డిస్ట్రిబ్యూటర్ ఇంటి ముందు బాధితుల ధర్నా
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash