వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో షాద్‌నగర్ నియోజకవర్గంలో గణేశ్ విగ్రహాల కొనుగోళ్లు జోరందుకున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో వాడవాడలా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారీ విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలకు తరలిస్తున్నారు. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని నిపుణులు సూచిస్తున్నప్పటికీ, యువతలో ఎక్కువ మంది జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ)తో తయారైన భారీ విగ్రహాలనే ఎంపిక చేసుకుంటున్నారు.షాద్‌నగర్‌లోని వినాయకగంజ్ గణేశ్ విగ్రహాల విక్రయాలకు ప్రధాన మార్కెట్‌గా మారింది. అక్కడ ఎక్కువగా పీవోపీ, రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాలే అందుబాటులో ఉన్నాయి. మట్టి విగ్రహాలను విక్రయించే వ్యాపారులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. మట్టి విగ్రహాలను రవాణా చేయడం, ప్రతిష్ఠించడం, నిమజ్జనం సమయంలో అవి దెబ్బతినే అవకాశం ఉండటంతో కొందరు యువత పీవోపీ విగ్రహాల వైపు మొగ్గు చూపుతున్నారని వ్యాపారులు చెబుతున్నారు.అయితే పీవోపీ, రసాయనిక రంగుల విగ్రహాలు నీటిలో సులభంగా కరగకపోవడంతో చెరువులు, కుంటల్లో వ్యర్థాలు పేరుకుపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనిక రంగుల వల్ల నీరు కలుషితమై జలచరాలు, పక్షులు, వ్యవసాయానికి నష్టం కలిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు. మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.