వర్షపాతం తగ్గడంతో పంట మార్పిడి విధానాన్ని అనుసరించిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన ఘంటా మాధవి-అశోక్‌రెడ్డి రైతు దంపతులు కూరగాయల సాగులో విజయాన్ని సాధిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా ఉండకపోవచ్చని భావించి, కూరగాయలు మరియు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టారు. వీరి సాగు విధానం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఈ రైతు దంపతులకు 9 ఎకరాల సొంత భూమితో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు ఉన్నాయి. మొత్తం 17 ఎకరాల్లో పత్తి, పసుపు, వరితో పాటు మూడు ఎకరాల్లో బీరకాయ, రెండున్నర ఎకరాల్లో కాకరకాయ, టమాట, క్యాబేజీ, బంతిపూలను సాగు చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్ పేపర్, తాత్కాలిక పందిళ్లను ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టారు.
విత్తనాలు, ఇతర సాగు ఖర్చుల కోసం సుమారు రూ.8 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇప్పటివరకు 13 టన్నుల బీరకాయ, 7 టన్నుల వరకు కాకరకాయ దిగుబడి వచ్చింది. మహబూబాబాద్, వరంగల్ మార్కెట్లలో కూరగాయలు విక్రయించి పెట్టుబడులు మినహాయించి రూ.6 లక్షల వరకు నికర ఆదాయం పొందారు. రాబోయే రోజుల్లో టమాట, బంతిపూల ద్వారా మరింత ఆదాయం వస్తుందని రైతు అశోక్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు
కూరగాయల సాగు.. లాభాలు బాగు: మహబూబాబాద్ రైతులకు ఆదర్శంగా కల్వల దంపతులు
0