తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారు. పీఎమ్‌ఏవై-జీ (PMAY-G) పథకంలో భాగంగా తెలంగాణకు మొదటి విడతగా 2 లక్షల ఇళ్లను కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన గ్రామీణ కుటుంబాలకు మరిన్ని ఇళ్లు అవసరమని పేర్కొంటూ, మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కోరారు.
సమావేశంలో ఎల్‌నినో ప్రభావంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో విద్యుత్ వినియోగం పెరుగుతోందని తెలిపారు. తాగునీరు, విద్యుత్ కొరత వంటి సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు.
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని సీఎం కోరారు. రాష్ట్రంలో రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తున్నామని వివరించారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్స్, వెజిటెబుల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంపై కేంద్ర సహాయం కోరిన సీఎం రేవంత్.. రాష్ట్రానికి మరిన్ని ఇళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి
0