హర్యానాలోని గురుగ్రామ్‌లో యువరాజ్ సింగ్ మంచందా హత్య ఘటన కలకలం రేపింది. పెళ్లికి సరిగ్గా నెల రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆర్థిక లావాదేవీల కారణంగా మాజీ సహోద్యోగిని తన భాగస్వామితో కలిసి యువరాజ్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం మృతదేహాన్ని మురుగు కాలువలో పడేసినట్లు సమాచారం.
యువరాజ్‌కు మరో నెల రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. సెప్టెంబర్ 6న తన సోదరీమణులతో కలిసి ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్‌కు వెళ్లి పెళ్లి దుస్తులు కొనుగోలు చేశాడు. అనంతరం గురుగ్రామ్‌లో మాజీ సహోద్యోగితో అత్యవసర సమావేశం ఉందని చెప్పి అక్కడికి వెళ్లాడు. రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తానని ఫోన్‌లో చెప్పినప్పటికీ తిరిగి రాలేదు. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. రోజుల తరబడి ఆచూకీ తెలియకపోవడంతో సెప్టెంబర్ 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యువరాజ్ మాజీ సహోద్యోగినిపై అనుమానం వ్యక్తం చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో ఆమెను, ఆమె భాగస్వామిని ఉత్తరాఖండ్‌లో గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు యువరాజ్‌ను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
పెళ్లికి నెల రోజుల ముందు విషాదం.. మాజీ సహోద్యోగుల చేతిలో యువకుడి హత్య
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk