హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. 2027 మార్చిలో ఎమ్మెల్సీ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితా రూపొందించే ప్రక్రియకు షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికల సంఘం ప్రకారం, పట్టభద్రుల ఓటర్ల నమోదుకు సెప్టెంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులను స్వీకరిస్తారు. నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి, డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం డిసెంబర్ 30న తుది పట్టభద్రుల ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓటరుగా నమోదైన వారు కూడా కొత్తగా ఫారం-18 దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పరిధిలో భారీ సంఖ్యలో పట్టభద్రులు ఉండటంతో ఓటర్ల నమోదును కీలకంగా భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కువ మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ యువతపై కూడా దృష్టి పెడుతున్నాయి.
నవంబర్ 1 నాటికి మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఎన్నికల్లో ఓటరుగా నమోదుకు అర్హులని అధికారులు తెలిపారు. దరఖాస్తుతో పాటు డిగ్రీ పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్, పోస్టు ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు.. సెప్టెంబర్ 28 నుంచి ఓటరు నమోదు ప్రారంభం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk