తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఓ వ్యక్తి చేసిన హల్‌చల్‌తో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరువనంతపురం నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న కేరళ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన ఓ వ్యక్తి ప్లాట్‌ఫాంపై కేకలు వేస్తూ రైలు పైకి ఎక్కాడు. అనంతరం అక్కడ ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని అతడిని కిందకు దించేందుకు ప్రయత్నించారు. దాదాపు గంటపాటు శ్రమించిన అనంతరం వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు.
విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో కొద్దిసేపు రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. కిందకు దించిన అనంతరం సదరు వ్యక్తి ‘తనను అరెస్ట్ చేస్తే 48 గంటల్లో కోర్టులో హాజరుపరచాలి’, ‘త్రీ స్టార్ అధికారి మాత్రమే రావాలి’ అంటూ హల్‌చల్ చేసినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడా లేదా మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనతో రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
రేణిగుంట రైల్వే స్టేషన్‌లో కలకలం.. రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్ పట్టుకునేందుకు యత్నం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk