కృష్ణాజిల్లాలోని గుడివాడలో చిట్టీల వ్యాపారం పేరుతో మోసం చేశారనే ఆరోపణలపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కొడాలి నాని ప్రధాన అనుచరుడిగా పేర్కొన్న మండాది శ్రీనివాసరావు, ఆయన భార్య మహాలక్ష్మి, కుమారుడు రేవంత్ సాయిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు సుమారు రూ.51.79 లక్షల మేర మోసం జరిగినట్లు కేసు నమోదైంది. పోలీసులు BNSలోని పలు సెక్షన్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం-1999 కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మహాలక్ష్మి, ఆమె కుమారుడు రేవంత్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రధాన నిందితుడిగా పేర్కొన్న మండాది శ్రీనివాసరావు ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 32 మంది చిరు మత్స్యకార కుటుంబాలకు చెందిన డబ్బులను చిట్టీల పేరుతో తీసుకుని తిరిగి చెల్లించలేదని బాధితులు ఆరోపించారు.
ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, నిందితుల ఆస్తులకు సంబంధం ఉందా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
గుడివాడలో చిట్టీల ముసుగులో మోసం.. వైసీపీ నేతలపై పోలీసుల చర్యలు
5
Published: 📅
Reported by: 🖊
Sarika Sk