న్యూయార్క్‌లో భారత జాతీయ జెండాను అవమానించిన ఖలిస్థానీ వేర్పాటువాదులపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ఎక్స్ వేదికగా హెచ్చరించారు. దేశాన్ని, జాతీయ జెండాను అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తన పోస్టులో స్పష్టం చేశారు.
న్యూయార్క్‌లోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరైన కార్యక్రమం సందర్భంగా స్టేడియం బయట జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను రిజిజు సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోలో ఓ వ్యక్తి భారత జాతీయ జెండాను తన కాలికి చుట్టుకుని అటూ ఇటూ ఊపుతూ అవమానించినట్లు కనిపించింది. ఈ ఘటనపై నెట్టింట పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.
రిజిజు తన పోస్టులో ఆర్ఎస్ఎస్‌ను లేదా బీజేపీని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. అయితే దేశాన్ని అవమానించడం మాత్రం అంగీకరించలేమని అన్నారు. భారతదేశం, జాతీయ జెండా పట్ల గౌరవం ఉండాలని స్పష్టం చేస్తూ హెచ్చరిక చేశారు. ఇదిలా ఉండగా, ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా AHEAD సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మోహన్ భగవత్ ప్రసంగించారు. అమెరికాలో నివసిస్తూ ఉపాధి పొందుతున్న వారు తాము నివసించే దేశం పట్ల బాధ్యతలను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు.
జాతీయ జెండాను అవమానిస్తే భారీ మూల్యం తప్పదు: కిరణ్ రిజిజు హెచ్చరిక
7
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati