కేరళకు చెందిన డావిన్సీ సురేష్ తన వినూత్న కళా ప్రయోగాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. సాధారణంగా పండగల సమయంలో రంగులు, పూలతో అందమైన ముగ్గులు వేస్తారు. అయితే సురేష్ మాత్రం అందుకు భిన్నంగా పట్టు చీరలను ఉపయోగించి భారీ ముగ్గును రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఓనం పండగ సందర్భంగా కొచ్చిలో ఏకంగా 2,500 పట్టు చీరలతో భారీ స్త్రీ రూపాన్ని ముగ్గులా చిత్రీకరించారు. ఈ ప్రత్యేక కళాకృతిని రూపొందించేందుకు ఆయన సుమారు 18 గంటల పాటు శ్రమించారు. ప్రపంచంలో ఇలాంటి చీరల ముగ్గు ఇప్పటివరకు ఎవరూ రూపొందించలేదని చెబుతున్నారు.
సురేష్ అసలు పేరు పి.కె. సురేష్. కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించిన ఆయన 11 మంది సంతానంలో పదో వ్యక్తి. కుటుంబంలోనే కళలపై ఆసక్తి ఉండటంతో చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌పై మక్కువ పెంచుకున్నారు. తన అన్న, కజిన్స్‌తో కలిసి ‘డావిన్సీ’ అనే ఆర్ట్ గ్రూప్‌ను ప్రారంభించారు. అంతర్జాతీయ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీపై అభిమానంతో తన పేరుకు ముందు ‘డావిన్సీ’ని చేర్చుకున్నారు.
ఇరవై ఏళ్లకు పైగా కళాకారుడిగా కొనసాగుతున్న సురేష్ ఎన్నో విభిన్న ప్రయోగాలు చేశారు. రంగుల చెక్కలతో పృథ్వీరాజ్, బొప్పాయితో శశి కలింగ, వంట సామాన్లతో మోహన్‌లాల్ చిత్రాలను రూపొందించారు. బంగారు నగలతో అబ్దుల్ కలామ్, ఒక టన్ను పూలతో శ్రీ నారాయణ గురు చిత్రాలను కూడా ఆవిష్కరించారు. కాఫీ బీన్స్, బాదం, జీడిపప్పు, బిస్కెట్లు వంటి వస్తువులతోనూ కళాకృతులు సృష్టించారు. పెయింటింగ్‌తో పాటు శిల్పాలు, సైకత శిల్పాలు, నటన, దర్శకత్వం, పాటల రచనలోనూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.
2,500 పట్టు చీరలతో అద్భుతమైన ముగ్గు.. డావిన్సీ సురేష్ సృజనాత్మకతకు జేజేలు
11
Published: 📅
Reported by: 🖊
Kanakadri