భిన్నత్వంలో ఏకత్వం అనే భావన భారత్, అమెరికా దేశాల డీఎన్‌ఏలోనే ఉందని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. అమెరికా గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా బహుళత్వం అనే అంశాన్ని ప్రస్తావిస్తారని, భారత్ విషయంలో మాత్రం భిన్నత్వంలో ఏకత్వం గురించి చెబుతారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏకత్వం, భిన్నత్వం రెండు దేశాల స్వభావంలోనూ అంతర్భాగమని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ‘యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్ (AHEAD) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
దేశాలు కేవలం భౌగోళిక ప్రాంతాలు మాత్రమే కాదని మోహన్ భాగవత్ అన్నారు. ప్రతి దేశానికి ఒక ప్రత్యేక గమ్యం ఉంటుందని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతోందని పేర్కొన్నారు. భిన్నత్వాన్ని కేవలం అంగీకరించడం మాత్రమే కాకుండా, దానిని గౌరవించి ఒక వేడుకలా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
మనుషుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండవని, అన్ని ఆధ్యాత్మిక మార్గాల అంతిమ గమ్యం ఒక్కటేనని భాగవత్ పేర్కొన్నారు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువు కాదని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నారైలు తమ కర్మభూమి, జన్మభూమి పట్ల బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. భిన్నత్వాన్ని గౌరవించడం, పరస్పర ఐక్యతను కాపాడుకోవడం ద్వారా సమాజంలో సామరస్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
భిన్నత్వంలో ఏకత్వం భారత్ డీఎన్‌ఏలోనే ఉంది: మోహన్ భాగవత్
1
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk