సీజనల్ వ్యాధుల పరిస్థితిపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో వ్యాధుల నియంత్రణ చర్యలను సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే డయేరియా, డిసెంట్రీ కేసులు కూడా తక్కువగా నమోదయ్యాయని చెప్పారు. అయితే టైఫాయిడ్ కేసులు స్వల్పంగా పెరిగిన నేపథ్యంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి జ్వరం కేసును పర్యవేక్షించాలని, అవసరమైన పరీక్షలు నిర్వహించి సరైన చికిత్స అందించాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఐఎల్‌ఐ (ఇన్‌ఫ్లూయెంజా లాంటి అనారోగ్యం), స్వైన్‌ఫ్లూ కేసులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఐఎల్‌ఐ కేసులపై రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
అలాగే దోమల నివారణ చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ‘డ్రై డే’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, నిల్వ నీటి తొలగింపు, లార్వా నిర్మూలన, ఫాగింగ్ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు నివారణకే ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధుల కేసులను తేలికగా తీసుకోవద్దు: మంత్రి దామోదర రాజనర్సింహ
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan