పండగొస్తే రంగులు, పూలతో ముగ్గులు వేయడం సాధారణం. కానీ కేరళకు చెందిన డావిన్సీ సురేష్ మాత్రం ఏకంగా చీరలతోనే ముగ్గు వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొచ్చిలో ఓనం సందర్భంగా 2,500 పట్టు చీరలను ఉపయోగించి భారీ స్త్రీ రూపాన్ని ముగ్గులా చిత్రీకరించాడు. ఈ ప్రత్యేక కళాకృతిని రూపొందించేందుకు సురేష్ ఏకంగా 18 గంటలు శ్రమించాడు. ఇలాంటి చీరల ముగ్గును ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరూ రూపొందించలేదని చెబుతున్నారు.
సురేష్ అసలు పేరు పి.కె. సురేష్. కేరళలోని త్రిస్సూర్‌లో జన్మించిన ఆయన 11 మంది సంతానంలో పదో వ్యక్తి. కుటుంబంలోనే కళల వాతావరణం ఉండటంతో చిన్నప్పటి నుంచే పెయింటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అన్న, కజిన్స్‌తో కలిసి ‘డావిన్సీ’ అనే ఆర్ట్ గ్రూప్‌ను కూడా ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీపై అభిమానంతో తన పేరుకు ముందు ‘డావిన్సీ’ని చేర్చుకున్నాడు.
ఇరవై ఏళ్లకు పైగా కళాకారుడిగా కొనసాగుతున్న సురేష్ వినూత్న ప్రయోగాలకు ప్రసిద్ధి చెందాడు. రంగుల చెక్కలతో పృథ్వీరాజ్, బొప్పాయితో శశి కలింగ, వంట సామాన్లతో మోహన్‌లాల్ చిత్రాలను రూపొందించాడు. బంగారు నగలతో అబ్దుల్ కలామ్, ఒక టన్ను పూలతో శ్రీ నారాయణ గురు చిత్రాలను కూడా ఆవిష్కరించాడు. కాఫీ బీన్స్, బాదం, జీడిపప్పు, బిస్కెట్లు వంటి విభిన్న వస్తువులతోనూ కళాకృతులు సృష్టించాడు. పెయింటింగ్‌తో పాటు శిల్పాలు, షార్ట్‌ఫిల్మ్స్, నటన, దర్శకత్వం, పాటల రచనలోనూ తన ప్రతిభను చాటుతున్నాడు.
చీరలతో ముగ్గు.. నగలతో పెయింటింగ్.. ఈ కళాకారుడి సృజనకు హద్దులే లేవు!
2
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati