కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ యువజన విభాగాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ప్రస్తుతం అనారోగ్య సమస్యతో కేరళలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్ ద్వారా హాజరుకానున్నారు.
సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటలకు యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. అనంతరం యువజన విభాగం లక్ష్యాలు, యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించడం, పార్టీ కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం వంటి అంశాలపై పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన యువజన విభాగం లోగోతో పాటు గీతాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.
యువతను పార్టీ కార్యకలాపాల్లో మరింత చురుకుగా భాగస్వామ్యం చేయడం, రాజకీయంగా వారికి దిశానిర్దేశం అందించడం ఈ విభాగం ద్వారా ప్రధానంగా చేపట్టనున్న కార్యక్రమాల్లో భాగంగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో యువజన విభాగం కార్యక్రమాలను నిర్వహించేందుకు జనసేన ప్రణాళికలు రూపొందించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పవన్ కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకలను పార్టీ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. యువతను పార్టీతో మరింతగా అనుసంధానం చేసేందుకు ఈ యువజన విభాగం కీలక వేదికగా మారే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 2న జనసేన యువజన విభాగం ఆవిష్కరణ.. ఆన్‌లైన్‌లో పవన్ కల్యాణ్
7
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk