నేటి బిజీ జీవనశైలిలో చాలామంది ఒంటరిగానే భోజనం చేస్తున్నారు. ఆఫీసు పనులు, వేరే నగరాల్లో ఒంటరిగా నివసించడం, సమయం లేకపోవడం వంటి కారణాలతో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి భోజనం చేసే అవకాశం తగ్గుతోంది. అయితే తరచూ ఒంటరిగా తినడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
అయితే ఒంటరిగా భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి నేరుగా హాని కలుగుతుందని చెప్పలేం. అప్పుడప్పుడు ఒంటరిగా తినడం సాధారణమే. కానీ ఎప్పుడూ ఇతరులకు దూరంగా ఉంటూ భోజనం చేసే అలవాటు ఉంటే ఒంటరితన భావన పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సామాజికంగా దూరంగా ఉంటున్నవారిలో ఈ అలవాటు మరింత ఒంటరితనానికి కారణం కావచ్చని సమాచారం. దీర్ఘకాలంగా ఒంటరితనాన్ని అనుభవించడం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో కలిసి భోజనం చేయడం కేవలం ఆహారం తీసుకోవడానికే పరిమితం కాదు. భోజనం సమయంలో మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, విషయాలను పంచుకోవడం ద్వారా సామాజిక సంబంధాలు బలపడతాయి. ఇది మనసుకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది.
మరోవైపు భోజనం చేసేటప్పుడు మొబైల్ లేదా టీవీ చూడటం కూడా మంచిది కాదు. స్క్రీన్‌పై దృష్టి పెట్టడం వల్ల ఎంత ఆహారం తీసుకుంటున్నామో గుర్తించకపోవచ్చు. అందుకే వీలైనప్పుడు కలిసి భోజనం చేయడం, భోజన సమయంలో స్క్రీన్‌లకు దూరంగా ఉండి ఆహారం రుచి, వాసన, పరిమాణంపై దృష్టి పెట్టడం మంచిది.
ఒంటరిగా భోజనం చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
5
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk