యాపిల్ సంస్థ సీఈఓగా టిమ్ కుక్ నేడు తప్పుకోనున్నారు. అయితే సంస్థ రోజువారీ కార్యకలాపాల నుంచి తప్పుకున్నప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు యాపిల్‌ను ముందుండి నడిపించిన కుక్.. స్టీవ్ జాబ్స్ తర్వాత సంస్థలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన నాయకత్వంలో యాపిల్ మార్కెట్ విలువ ఏకంగా 25 రెట్లు పెరిగి 4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగింది.
స్టీవ్ జాబ్స్ నుంచి సంస్థ పాలనా పగ్గాలు అందుకున్న సమయంలో టిమ్ కుక్ సామర్థ్యంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే 15 ఏళ్లలో వాటిని ఆయన పటాపంచలు చేశారు. జాబ్స్ తప్పుకునే సమయంలో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువను భారీ స్థాయికి తీసుకెళ్లారు. కుక్ సీఈఓగా ఉన్న సమయంలో సంస్థ షేర్ల విలువ 2359 శాతం పెరిగినట్లు కథనం పేర్కొంది.
కుక్ హయాంలో యాపిల్ కొత్త మార్కెట్లలో విస్తరించడంతో పాటు సేవల విభాగాన్ని బలోపేతం చేసింది. యాప్ స్టోర్, యాపిల్ మ్యూజిక్, యాపిల్ పే వంటి సేవలు సంస్థకు కీలక ఆదాయ వనరులుగా మారాయి. ప్రస్తుతం సేవల విభాగం ద్వారా యాపిల్‌కు 100 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వస్తోంది.
హార్డ్‌వేర్ రంగంలోనూ కుక్ తనదైన ముద్ర వేశారు. ఇంటెల్‌పై ఆధారపడే స్థాయి నుంచి సొంత చిప్స్ తయారీ దిశగా యాపిల్‌ను తీసుకెళ్లారు. యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్, ఎయిర్‌ట్యాగ్, విజన్ ప్రో వంటి ఉత్పత్తులు ఆయన సారథ్యంలో ప్రారంభమయ్యాయి.
అయితే కుక్ ప్రయాణం పూర్తిగా విజయవంతం కాలేదు. 2012లో ప్రారంభించిన యాపిల్ మ్యాప్స్ కచ్చితత్వంపై విమర్శలు ఎదుర్కొంది. ఎలక్ట్రిక్, స్వయంచాలిత వాహనాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ టైటన్‌ను కూడా ఖర్చులు, భవిష్యత్తుపై అనిశ్చితి కారణంగా సంస్థ నిలిపివేసింది.
యాపిల్‌పై టిమ్ కుక్ చెరగని ముద్ర.. 4 ట్రిలియన్ డాలర్ల సంస్థగా!
10
Published: 📅
Reported by: 🖊
Kanakadri