వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కేవలం ఒక ప్రాజెక్టు ప్రారంభం కాదని, కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వెలిగొండతో కరువు ప్రాంత రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని, సాగునీరు, తాగునీరు, ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధికి ఇది కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.
మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేశారని మంత్రి తెలిపారు. 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల మీదుగానే ఇది జాతికి అంకితం కావడం చారిత్రాత్మకమని అభివర్ణించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారనేందుకు వెలిగొండ ప్రాజెక్టు నిదర్శనమని అన్నారు.
వెలిగొండ ద్వారా 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల రైతులకు ఈ ప్రాజెక్టు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది మందికి తాగునీటి భరోసా కల్పించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
కృష్ణా వరద జలాలను కరువు నేలకు మళ్లించడం ద్వారా రైతుల పొలాలకు జీవం పోస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. వెలిగొండతో చెరువులు నిండుతాయని, భూగర్భ జలాలు పెరుగుతాయని, వ్యవసాయానికి కొత్త ఊపు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కరువు కారణంగా జరిగే వలసలకు శాశ్వత పరిష్కారం చూపే జీవనరేఖగా వెలిగొండ నిలుస్తుందని అన్నారు. నిర్వాసిత కుటుంబాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, 48 రోజుల్లోనే రూ.762 కోట్ల పరిహారం అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాదు.. కరువు సీమ భవిష్యత్తును మార్చే చారిత్రక ఘట్టం
2
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati