ప్రముఖ జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. సంస్థ కార్యకలాపాల్లో మౌలిక మార్పులు తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ సూపర్‌వైజరీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇటీవల 50 వేల మంది ఉద్యోగులను తగ్గించే నిర్ణయం తీసుకున్న ఫోక్స్‌వ్యాగన్, తాజాగా మరో 50 వేల మంది ఉద్యోగులపై కోత విధించేందుకు సిద్ధమైంది. కార్మిక సంఘాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆటో రంగంలో పెరుగుతున్న పోటీ, ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ పరిస్థితులు సంస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా చైనా కంపెనీల నుంచి వస్తున్న పోటీ, అమెరికాలో సుంకాల భారం కారణంగా ఫోక్స్‌వ్యాగన్ సవాళ్లను ఎదుర్కొంటోంది. అవసరానికి మించి ఉత్పత్తి సామర్థ్యం ఉండటం కూడా పునర్ వ్యవస్థీకరణకు కారణమని సంస్థ పేర్కొంది.
ఫోక్స్‌వ్యాగన్ మేనేజ్‌మెంట్ బోర్డు రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికకు సూపర్‌వైజరీ బోర్డు ఆమోదం తెలిపింది. అయితే ఉద్యోగుల తొలగింపులు ఏ సమయంలో ప్రారంభమవుతాయి, ఏ దేశాలు లేదా విభాగాలపై ప్రభావం ఉంటుంది అనే వివరాలను సంస్థ వెల్లడించలేదు.
2025 నాటికి ఫోక్స్‌వ్యాగన్‌కు ప్రపంచవ్యాప్తంగా 6.6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. బెంట్లే, లాంబోర్ఘినీ వంటి ప్రముఖ కార్లను కూడా సంస్థ తయారు చేస్తోంది. అయితే చైనా సంస్థల నుంచి పోటీ పెరగడం, కొత్త టెక్నాలజీల్లో మార్పులు సంస్థ లాభాలపై ప్రభావం చూపుతున్నాయి.
ఫోక్స్‌వ్యాగన్‌లో భారీ కోతలు.. లక్ష మంది ఉద్యోగుల తొలగింపుకు ప్రణాళిక
19
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk