అమెరికాలో ఇద్దరు భారతీయ మహిళల హత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. కేరళకు చెందిన అన్నా మేరీ మ్యాథ్యూ, అంజనా హరి అనే ఇద్దరు మహిళలు కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో నివసిస్తున్నారు. వీరిని వారి స్నేహితురాలు అనిలా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకరిని కత్తితో పొడిచి చంపగా, మరొకరిని పార్కింగ్ ఏరియాలో కారుతో ఢీకొట్టి హత్య చేసినట్లు తెలిపారు.
ఆగస్టు 28న డిక్సన్ లాండింగ్ రోడ్‌లో హిట్ అండ్ రన్ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజనా హరి మృతదేహాన్ని గుర్తించారు. నీలిరంగు కారు ఆమెను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. అనంతరం పోలీసులు ఆ కారును గుర్తించి, దాని యజమాని 32 ఏళ్ల అనిలాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అంజనాను కారుతో ఢీకొట్టి చంపినట్లు ఆమె అంగీకరించింది.
అంతకుముందు అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌లో అన్నా మేరీని కత్తితో పొడిచి చంపినట్లు కూడా అనిలా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసులు అన్నా మేరీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ముగ్గురూ ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని నెలల క్రితం అనిలా ఉద్యోగం కోల్పోయిందని, ఉద్యోగానికి సంబంధించిన వివాదమే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో దారుణం.. ఇద్దరు భారతీయ మహిళలను హత్య చేసిన స్నేహితురాలు
8
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk