పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరిగిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో నరసాపురం ప్రాంతంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఎన్నో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం తీవ్ర నష్టాలను ఎదుర్కొందని విమర్శించారు.
రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని సీఎం చెప్పారు. ఇప్పటివరకు పెన్షన్ల కోసం రూ.75,503 కోట్లను ఖర్చు చేశామని, ఈ మొత్తంతో మూడు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చని వ్యాఖ్యానించారు. దేశంలో రూ.4 వేలు, రూ.6 వేలు, రూ.10 వేలు, రూ.15 వేలు పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు.
మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశామని, దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించామని చంద్రబాబు తెలిపారు. మహిళలు భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తారని అన్నారు. డ్వాక్రా ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అలాగే ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని, వాటిని మహిళలు నడిపే అవకాశాలు కల్పించాలని చెప్పారు. ప్రతి ఇంట్లో ఒక చిన్న పారిశ్రామికవేత్త ఎదగాలనే లక్ష్యంతో వన్ హౌస్-వన్ ఆంత్రప్రెన్యూర్ పథకాన్ని తీసుకువచ్చినట్లు సీఎం వెల్లడించారు.
మూడు పోలవరాలు కట్టేంత పెన్షన్లకు ఖర్చు చేశాం: సీఎం చంద్రబాబు
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan