దేశంలో అతిపెద్ద ఈక్విటీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తొలిసారిగా ఐపీఓకు వస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 17న ప్రారంభమై 21న ముగియనుంది. ఎన్‌ఎస్‌ఈ ఒక్కో షేరుకు రూ.1,700 నుంచి రూ.1,785గా ధరల శ్రేణిని నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద ఇష్యూ ద్వారా రూ.22,569 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది.ఈ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) విధానంలో జరుగుతుంది. ఎన్‌ఎస్‌ఈలోని ప్రస్తుత వాటాదారులు మొత్తం 12.64 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. గతంలో సమర్పించిన ముసాయిదా పత్రాల్లో 14.9 కోట్ల షేర్లను విక్రయించాలని ప్రతిపాదించగా, కొందరు వాటాదారులు తమ విక్రయ పరిమాణాన్ని 15 శాతం తగ్గించుకోవడంతో తుది ఆఫర్ సైజు తగ్గింది. OFS కావడంతో ఇష్యూ ద్వారా వచ్చే నిధులు నేరుగా షేర్లు విక్రయించే వాటాదారులకు వెళ్తాయి.ఎన్‌ఎస్‌ఈ అర్హత కలిగిన ఉద్యోగుల కోసం రూ.70 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసింది. ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.170 ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.గరిష్ఠ ఇష్యూ ధర ఆధారంగా ఎన్‌ఎస్‌ఈ మార్కెట్ విలువ సుమారు రూ.4.4 లక్షల కోట్లకు చేరనుంది. ఇది బీఎస్‌ఈ ప్రస్తుత మార్కెట్ విలువ కంటే మూడు రెట్లకు పైగా ఉంటుంది. ఐపీఓ అనంతరం ఎన్‌ఎస్‌ఈ షేర్లు సెప్టెంబర్ 24న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు ధరల శ్రేణి ఖరారు.. రూ.22,569 కోట్ల వరకు సమీకరణ
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash