ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా పిపల్‌కోటిలో నిర్మాణంలో ఉన్న టీహెచ్‌డీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా బిర్హి నది సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పెద్దఎత్తున వరదనీరు, బురద, శిథిలాలు సొరంగంలోకి చేరడంతో అక్కడ విధుల్లో ఉన్న కార్మికులు చిక్కుకుపోయారు.
ప్రమాదం అనంతరం సహాయక బృందాలు రంగంలోకి దిగి సొరంగంలో పేరుకుపోయిన నీరు, శిథిలాలను తొలగిస్తూ గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఏడుగురు కార్మికులు మృతిచెందగా, తాజాగా మరో మృతదేహాన్ని వెలికితీయడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగంతో పాటు సంబంధిత అన్ని విభాగాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
సొరంగంలో భారీగా చేరిన నీరు, బురద కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నిర్మాణ ప్రాజెక్టుల్లో పనిచేసే కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఉత్తరాఖండ్ టీహెచ్‌డీసీ సొరంగ ప్రమాదం.. మృతుల సంఖ్య ఎనిమిదికి చేరిక
6
Published: 📅
Reported by: 🖊
Banu Prakash