హైదరాబాద్ నగరంలోని వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగనున్నాయి. రోడ్డు విస్తరణ, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మరో 14 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు వైశాలినగర్ అండర్‌పాస్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ పనుల కోసం గతంలో జూలై 16 నుంచి 20 రోజుల పాటు, ఆ తర్వాత మరో 29 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే పనులు నిర్ణయించిన సమయంలో పూర్తికాకపోవడంతో తాజాగా మరోసారి గడువు పొడిగించారు.
వైశాలినగర్ అండర్‌పాస్ మీదుగా ప్రయాణించే వాహనాలను మైహోమ్ మంగళ టి-జంక్షన్ వద్ద నుంచి ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నారు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు కొంత అదనపు సమయం కేటాయించుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు జరుగుతున్నప్పటికీ, గడువులు పొడిగించడం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులు త్వరగా పూర్తి చేసి సాధారణ రాకపోకలను పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.
వైశాలినగర్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. మరో 14 రోజులు వాహనదారులకు ఇబ్బందులు
22