హైదరాబాద్‌లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఈవినింగ్ ఓపీ క్లినిక్‌లు ప్రస్తుతం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. ఆర్భాటంగా ప్రారంభించిన ఈ క్లినిక్‌లు రోగులకు అందుబాటులో లేకుండా పోయాయని సమాచారం. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే, నిలోఫర్, ప్రసూతి ఆస్పత్రుల్లో ఉదయం ఓపీకి పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. చికిత్స కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉదయం ఓపీ సమయంలో రోగులు రిజిస్ట్రేషన్ నుంచి వైద్యుల పరీక్షల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఓపీ చీటి తీసుకోవడం, డాక్టర్‌ను కలవడం, పరీక్షలు చేయించుకోవడంతోనే సమయం ముగిసిపోతుంది. వైద్యులు సూచించిన పరీక్షలు పూర్తి చేసుకోవడానికి మరుసటి రోజు వరకు వేచి చూడాల్సి వస్తోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రతీ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఈవినింగ్ క్లినిక్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అమలులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. రోగులకు ఈ సదుపాయం గురించి సరైన అవగాహన లేకపోవడం, కొంతమంది సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల క్లినిక్‌లు నిరుపయోగంగా మారుతున్నాయి.
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు ప్రతిరోజూ 1500 నుంచి 2000 మంది వరకు రోగులు వస్తున్నారని సమాచారం. ఓపీ రిజిస్ట్రేషన్ సమయం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఉండటంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఈవినింగ్ క్లినిక్‌లకు ప్రచారం పెంచడంతో పాటు, ఉదయం ఓపీ సమయాన్ని మధ్యాహ్నం 2 గంటల వరకు పొడిగించాలని పలువురు రోగులు కోరుతున్నారు.
ఈవినింగ్ క్లినిక్‌లు ఎక్కడ? ఆర్భాటంగా ప్రారంభించి.. అమలులో నిర్లక్ష్యం
17
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan