ఎర్రగడ్డల ధరలు సామాన్య ప్రజలకు షాక్ ఇస్తున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రస్తుతం తిరుపతి మార్కెట్‌లో కిలోకు రూ.70కి చేరుకున్నాయి. గత నెలతో పోలిస్తే కిలో ఉల్లిపై దాదాపు రూ.30 వరకు పెరుగుదల నమోదైంది. దీంతో వినియోగదారులు అధిక ధరలకు ఉల్లిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పంట దిగుబడి తగ్గడం వల్లే ఉల్లి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. తిరుపతి మార్కెట్‌కు సాధారణంగా ప్రతిరోజూ ఐదు నుంచి ఏడు లారీల ఉల్లి సరుకు వచ్చేదని, కానీ గత పది రోజులుగా మూడు నుంచి నాలుగు లారీల సరుకు రావడమే కష్టంగా మారిందని తెలిపారు.
మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉల్లి సాగు కూడా సరిగా జరగలేదని వ్యాపారులు పేర్కొన్నారు. సరఫరా తగ్గడం, డిమాండ్ కొనసాగడం కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఉల్లి ధరల ప్రభావం హోటల్ రంగంపైనా పడింది. ధరలు భారీగా పెరగడంతో కొన్ని హోటళ్లలో ఉల్లి ఆధారిత వంటకాలను తాత్కాలికంగా మెనూ నుంచి తొలగించారు. తిరుపతిలోని కొన్ని హోటళ్లలో ఆనియన్ దోస కనిపించకుండా పోయింది. సమోసా తయారీలో కూడా ఉల్లికి బదులుగా క్యారెట్, క్యాబేజీ వాడుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తున్న వ్యాపారులు, ధరలు తగ్గాలంటే సరఫరా పెరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ఎర్రగడ్డల ధరలకు రెక్కలు.. కిలో రూ.70కి చేరిన ఉల్లి ధర
10
Published: 📅
Reported by: 🖊
Banu Prakash