తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొళత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన స్టాలిన్ ఓట్ల లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. 100 శాతం వీవీప్యాట్ రీవెరిఫికేషన్ నిర్వహించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఎన్నికల్లో స్టాలిన్‌కు 74,202 ఓట్లు రాగా, టీవీకే పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు 82,997 ఓట్లతో విజయం సాధించారు. ఫలితాలపై సందేహాలు వ్యక్తం చేసిన స్టాలిన్ మే 7న ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్ పరిశీలన కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్‌లను మళ్లీ పరిశీలించాలని కోరారు.
జులై 29న జరిగిన పరిశీలన సమయంలో కొన్ని ఈవీఎంలు పనిచేయకపోవడాన్ని స్టాలిన్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల ఫలితాల నిజానిజాలు తెలుసుకునేందుకు పూర్తి స్థాయి వీవీప్యాట్ పరిశీలన అవసరమని వాదించారు.
మరోవైపు ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఎన్నికల కౌంటింగ్‌పై అభ్యంతరాలను ఈసీఐకి పిటిషన్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం మద్రాస్ హైకోర్టు స్టాలిన్ పిటిషన్‌ను తిరస్కరించింది.
ఈ కేసులో స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా, ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం పిటిషన్ కొనసాగించే అవకాశం లేదని ఈసీఐ తరఫు న్యాయవాదులు వాదించారు.
స్టాలిన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ.. 100% వీవీప్యాట్ రీవెరిఫికేషన్ పిటిషన్ కొట్టివేత
7
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati