భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గంజాయి స్మగ్లింగ్‌ను ఈగల్ ఫోర్స్, పోలీసులు భగ్నం చేశారు. బూర్గంపాడు మండలం సారపాక వద్ద నిర్వహించిన తనిఖీల్లో కంటైనర్‌లో రహస్యంగా తరలిస్తున్న 525 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని మార్కెట్ విలువ సుమారు రూ.2.62 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
కంటైనర్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సీక్రెట్ కంపార్ట్‌మెంట్‌లో గంజాయిని అత్యంత చాకచక్యంగా దాచినట్లు పోలీసులు గుర్తించారు. సాధారణ తనిఖీల్లో గుర్తించలేని విధంగా ఏర్పాటు చేసిన ఈ రహస్య గదిని పరిశీలించిన అనంతరం భారీ మొత్తంలో గంజాయి బయటపడింది.
ప్రాథమిక విచారణలో ఈ మాదకద్రవ్యాన్ని ఒడిశా నుంచి సేకరించి ఉత్తరప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాలుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
నిందితుల వద్ద నుంచి గంజాయితో పాటు కంటైనర్, ఒక బైక్, ఐదు సెల్‌ఫోన్లు, రూ.10,570 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెట్‌వర్క్ వెనుక మరింత పెద్ద ముఠా ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ కేసులో పూర్తి స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు దర్యాప్తును మరింత విస్తరించినట్లు వెల్లడించారు.
సారపాకలో భారీ గంజాయి పట్టివేత.. రూ.2.62 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan