ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో జరుగుతున్నట్లు ప్రచారంలో ఉన్న వసూళ్లపై దర్శకుడు సముద్ర కీలక ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తున్నారని, ప్రజల్లో అపోహలు నెలకొనకుండా ఉండేందుకే ఈ వివరణ ఇస్తున్నట్లు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని సముద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వం స్థలాలు ఇచ్చిందని, వాటి పేరుతో సభ్యుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.
కొంతమంది తనకు ఫోన్ చేసి ఈ విషయంపై వివరణ కోరడంతో అందరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసినా, అందులో తన పేరు ఉపయోగించినా తాను సహించబోనని హెచ్చరించారు.
ఇటీవల ఏర్పాటు చేసిన ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కమిటీ సమర్థంగా పనిచేస్తోందని సముద్ర తెలిపారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, కొత్త కమిటీ కూడా ఆ దిశగా కృషి చేస్తోందని పేర్కొన్నారు.
తనకు అప్పగించిన ఏపీ ఎఫ్‌డీసీ డైరెక్టర్ బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్రసీమ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సినీ రంగానికి అవసరమైన సౌకర్యాల విస్తరణ కోసం తన వంతు కృషి కొనసాగిస్తానని చెప్పారు.
సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణలు, దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సముద్ర విజ్ఞప్తి చేశారు. అధికారిక సమాచారం లేకుండా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని కూడా సూచించారు.
హౌసింగ్ సొసైటీ వసూళ్లతో నాకు సంబంధం లేదు: సముద్ర
9
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan