మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం అనంతరం హోర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కీలక సమావేశం నిర్వహించాయి. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాద్ి వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరు దేశాల సంయుక్త హోర్ముజ్ కమిటీ సోమవారం మస్కట్‌లో తొలి సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సమావేశంలో హోర్ముజ్ జలసంధి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ నిర్వహణ విధానం, నౌకా రవాణా మార్గాలు, సేవల కోసం వసూలు చేసే రుసుములు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం అనంతరం భవిష్యత్ పరిపాలనపై ఇరు దేశాలు ఉమ్మడి అవగాహనకు వచ్చినట్లు ఘరీబాబాద్ి తెలిపారు.
సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఇరాన్, ఒమాన్ మధ్య ప్రత్యేక సాంకేతిక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో నిపుణుల స్థాయి చర్చలు ప్రారంభించి, నౌకా మార్గాలు, పరిపాలనా విధానం, సాంకేతిక అంశాలపై సంయుక్త పత్రాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించారు.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక మార్గంగా గుర్తింపు పొందింది. ఇరాన్, ఒమాన్ మధ్య ఉన్న ఈ సన్నని సముద్ర మార్గం ద్వారా గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు భారీ స్థాయిలో ఇంధన సరఫరా జరుగుతుంది. యుద్ధ సమయంలో ఈ మార్గాన్ని ఇరాన్ దిగ్బంధించగా, అనంతరం జరిగిన చర్చల్లో దీని భవిష్యత్ నిర్వహణ ప్రధాన అంశంగా మారింది.
ఇరాన్ భవిష్యత్‌లో నౌకలకు అందించే సేవలపై రుసుములు వసూలు చేసే అంశాన్ని పరిశీలిస్తుండగా, హోర్ముజ్ అంతర్జాతీయ జలమార్గమని పేర్కొంటూ అమెరికా అదనపు రుసుములకు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల ఒమాన్ కూడా ఈ అంశంపై పలు ప్రకటనలు చేయగా, ఇరు దేశాలు ఇప్పుడు సాంకేతిక చర్చల ద్వారా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి.
హోర్ముజ్ నిర్వహణపై ఇరాన్-ఒమాన్ తొలి భేటీ.. కీలక అవగాహన
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan